మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచిన ప్రజాపాలన
నల్లబెల్లి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ ధర్నా
కాకతీయ.నల్లబెల్లి: ప్రజాపాలన పేరుతో రైతులను తీవ్రంగా నష్టపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో కలిసి గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో వరంగల్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్ రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై అవగాహన లేని ప్రభుత్వ పాలన వల్లే మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 35 వేల బస్తాలు తరలింపుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, లారీలు సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత ఇరవై రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
ఎకరాకు కేవలం 25 క్వింటాళ్ల పంటనే కొనుగోలు చేసి, మిగిలిన సరుకును రైతులు దళారులకు అమ్ముకునేలా ప్రభుత్వం నెట్టేస్తోందని విమర్శించారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా రైతు సంక్షేమం? అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై అనుభవం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల నుంచి మద్దతు ధర వరకు అన్ని సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

