కో-ఆప్షన్ పదవులపై బీఆర్ఎస్ నేతల అసంతృప్తి
పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పని నిరాశ!
ఒకే ఇంట్లో రెండు పదవులా? అని ప్రశ్న
రామకృష్ణాపూర్ గులాబీ శ్రేణుల్లో ముదురుతున్న చర్చ
కాకతీయ, రామకృష్ణాపూర్: మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించి, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన బీఆర్ఎస్ నాయకుల్లో ఇప్పుడు కో-ఆప్షన్ పదవుల వ్యవహారం తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం దాదాపు 51 రోజుల పాటు క్యాంపుల్లో గడిపి, పీఠాన్ని కైవసం చేసుకోవడంలో అహర్నిశలు కష్టపడ్డ నేతలు ఇప్పుడు తమకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొత్తులు.. సమీకరణాలు..
మొత్తం నాలుగు కో-ఆప్షన్ స్థానాల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒకటి కేటాయించగా, మిగిలిన మూడు స్థానాల్లో మహిళా మైనారిటీ, జనరల్ మహిళా, జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈ పదవుల కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటికే కొందరికి సంకేతాలు ఇచ్చి, పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే, ఈ ఎంపిక ప్రక్రియపై పార్టీలోని సీనియర్లు, మాజీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఇంట్లో రెండు పదవులా?
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన వారిని కాదని, ఒకే కుటుంబానికి రెండు పదవులు కట్టబెట్టడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భార్య కౌన్సిలర్‌గా గెలవగా, మళ్లీ భర్తకు కో-ఆప్షన్ పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సీనియర్ నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కూడా కొందరు తమకు పదవులు కావాలని నేరుగా కోరగా, వారికి పట్టణ పార్టీ పదవులు ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తమ శ్రమను గుర్తించకుండా పదవుల కేటాయింపు జరిగితే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం తప్పదని ఆశావాహులు హెచ్చరిస్తున్నారు. మరి అధిష్ఠానం కష్టపడ్డ నేతలను గుర్తిస్తుందో లేదో వేచి చూడాలి.

