హత్య చేసిన కొడుకును పట్టించిన తల్లి
కొడుకు చేసిన నేరాన్ని భరించలేని తల్లి
భువనగిరి జిల్లా మేడిపల్లి గ్రామంలో విషాదం
మద్యం మత్తులో స్నేహితుడిని చంపిన ఇద్దరు
కాకతీయ, భువనగిరి : మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసి, గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టిన పాషాణ హృదయాల ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. కన్నకొడుకు చేసిన ఘోర నేరాన్ని తెలుసుకున్న ఒక తల్లి, మమకారం కంటే బాధ్యతకే పెద్దపీట వేసి అతడిని పోలీసులకు పట్టించిన సాహసోపేత ఘటన బొమ్మలరామారం మండలం మేడిపల్లిలో సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లికి చెందిన రాగీరు మధు (25), గాంధారి చరణ్, ఊట్ల నవీన్ ప్రాణ స్నేహితులు. చరణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా, నవీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మధు మద్యం బానిసగా మారి ఖాళీగా ఉంటుండేవాడు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ముగ్గురూ కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుక మద్యం సేవించారు. ఆ సమయంలో మధుకు, మిగతా ఇద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదరడంతో ఆగ్రహానికి గురైన చరణ్, నవీన్ కలిసి మధు తలపై రాడ్డుతో బలంగా బాదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మధు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వాగు వద్దకు తరలించి..
నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితులు పథకం వేశారు. మృతదేహాన్ని తెల్లవారుజామున 4 గంటల సమయంలో శామీర్‌పేట్ వాగు వద్దకు తరలించారు. అక్కడ ఇసుక దిబ్బలోని గడ్డిలో మృతదేహాన్ని పాతిపెట్టి, ఏమీ తెలియనట్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మధుకు తరచూ రెండు మూడు రోజుల వరకు ఇంటికి రాకుండా బయట తిరిగే అలవాటు ఉండటంతో, అతడు కనిపించకపోయినా తల్లిదండ్రులు తొలుత పెద్దగా ఆందోళన చెందలేదు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు చరణ్ మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం తన తల్లి వద్దకు వెళ్లి, మద్యం మత్తులో తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. కొడుకు మాటలు విని నిర్ఘాంతపోయిన ఆ తల్లి.. మమకారంతో నేరాన్ని కప్పిపుచ్చాలని చూడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, కొడుకును వారికి అప్పగించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కొడుకు మరణవార్త విన్న మధు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితుల్లో చరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు. నేరం చేసిన కొడుకును చట్టానికి అప్పగించిన ఆ తల్లి నిజాయితీని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.

