జావేద్ కుటుంబానికి డిప్యూటీ సీఎం భరోసా
దివంగత నేత నివాసానికి వెళ్లి పరామర్శించిన భట్టి విక్రమార్క
పిల్లల చదువులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
కాకతీయ, చింతకాని: ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత మహమ్మద్ జావేద్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొండంత అండగా నిలిచారు. ఆదివారం ఖమ్మం నగరంలోని రెడ్ హిల్స్ హౌసింగ్ సొసైటీలో గల జావేద్ నివాసానికి వెళ్లిన ఆయన.. తొలుత దివంగత నేత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పరామర్శలో భాగంగా జావేద్ ఇద్దరు కుమార్తెలతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న పెద్ద కుమార్తె మహమ్మద్ షహేలా జావేద్‌తో మాట్లాడి, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సివిల్స్ ప్రిపరేషన్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
మీ భవిష్యత్తుకు మాది బాధ్యత..
అలాగే ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమార్తె మదిహ సభాహత్ విద్యా వివరాలను అడిగి తెలుసుకున్నారు. “మీ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది” అని పిల్లలకు భరోసానిచ్చారు. పార్టీ కోసం జావేద్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

