రీల్స్ మాయలో పడి.. రూ.87,810 పోగొట్టుకొని..
తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలంటూ నమ్మించిన మోసగాళ్లు
పోలీసులను ఆశ్రయించిన డిప్లొమా విద్యార్థి
కాకతీయ, కరీంనగర్: సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, రీల్స్‌ను నమ్మి ఓ విద్యార్థి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చన్న ఆశతో ఏకంగా రూ.87,810లు సైబర్ నేరగాళ్ల పాలు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన ఓ డిప్లొమా విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను చూశాడు. అందులో తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయని ఉండటంతో సదరు వ్యక్తులను సంప్రదించాడు. ముందుగా చిన్న మొత్తంలో డబ్బులు పంపగా, వారు కొంత లాభం వచ్చినట్లు నమ్మబలికారు. అది నిజమని నమ్మిన బాధితుడు మోసగాళ్ల మాయమాటలకు పడి పలు దఫాలుగా యూపీఐ ద్వారా మొత్తం రూ.87,810లు చెల్లించాడు. ఆ తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని వారు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన విద్యార్థి వారిని ప్రశ్నించాడు. కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

