కరీంనగర్లో ఘనంగా మే డే వేడుకలు
ఉత్తమ కార్మికులకు పురస్కారాల అందజేత
వేతనాలు పెంచాలని కలెక్టర్కు డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్: ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. కార్మిక, ఉపాధి ఉత్పత్తి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేయర్ వై. సునీల్ రావు, కలెక్టర్ చిత్ర మిశ్రా, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ కార్మికులు, ఉద్యోగులను శాలువాలతో సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులే సమాజానికి వెన్నెముక అని కొనియాడారు. అయితే, ప్రస్తుత కాలంలో పారిశుధ్య కార్మికుల వేతనాలు కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.16 వేలతో కుటుంబం గడవడం కష్టమని, వారి వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం..
కరీంనగర్లోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల సౌకర్యార్థం జిల్లాలో ‘ఈఎస్ఐ’ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఉపాధి శాఖ ద్వారా యువతకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అధికారుల ప్రసంగాల అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, కార్మిక శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

