గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక బాట
ఏఐ, రోబోటిక్స్‌లో విద్యార్థుల ప్రతిభ అమోఘం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథనిలో ‘సూపర్ సమ్మర్’ శిబిరం సందర్శన
కాకతీయ, మంథని : గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో టి-ఫైబర్, సూపర్ టీచర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సూపర్ సమ్మర్” వేసవి శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించి, వారితో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. డిజిటల్ అక్షరాస్యత విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తయారు చేసిన ‘మూన్ ల్యాండర్’ నమూనాను చూసి ముగ్ధులైన మంత్రి.. అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యతను వివరించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక విద్యను చేరువ చేయడంలో టి-ఫైబర్ కృషిని ఆయన ప్రశంసించారు. మంథని నుంచి 70 మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొంటుండగా, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 351 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు, శిక్షణ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

