ఉత్సాహంగా వేసవి హాకీ శిక్షణ శిబిరం
కాకతీయ, హుజురాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ కార్యదర్శి బొడిగె తిరుపతి గౌడ్‌తో కలిసి శ్రీనివాస్ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో మెళకువలు నేర్చుకుని క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పట్టణానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, కోచ్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొనే చిన్నారులకు, యువతకు నిష్ణాతులైన కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సాంబరాజు, వినయ్ వంశీ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

