తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనాలి
ఎమ్మెల్యే సొంత మండలంలో రైతుల గోడు
అయినా పట్టింపులేకపోవడం దారుణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, చెన్నారావుపేట : స్థానిక ఎమ్మెల్యే సొంత మండలంలోనే రైతులు అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని జోజీపేట వడ్ల కొనుగోలు కేంద్రంతో పాటు చెన్నారావుపేట మొక్కజొన్న కేంద్రాలను ఆయన సందర్శించి, తడిసిన పంటలను పరిశీలించారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల పంపిణీలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని, అధికారులు వారికి కొమ్ముకాస్తూ సామాన్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను పట్టించుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్, సొసైటీ చైర్మన్లు చింతకింది వంశీ, మురహరి రవి, నాయకులు అనుముల కుమారస్వామి, అమ్మ రాజేష్, కొండవీటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

