బొమ్మనపల్లి మత్స్య సంఘం అధ్యక్షుడిగా సంపత్
మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక.. ఉపాధ్యక్షుడిగా కిరణ్
సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
కాకతీయ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ నివాసంలోని సంఘ భవనంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. సంఘం అధ్యక్షుడిగా మామిడి సంపత్ వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. ఉపాధ్యక్షుడిగా పెండెల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎండ్ర రాజ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్లుగా మామిడి మల్లయ్య, మామిడి రాజయ్య, మామిడి రాజు, కీసర శంకర్, నెల్లి సదానందం, మామిడి వెంకటయ్యలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామస్థులు, సంఘ సభ్యులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అర్హులందరికీ సభ్యత్వం ఇప్పిస్తాం
అనంతరం అధ్యక్షుడు మామిడి సంపత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించిన ముదిరాజ్ సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మత్స్య సహకార సంఘంలో 75 మంది సభ్యులు ఉన్నారని, కుల సంఘంలో 109 మంది ఉన్నారని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మత్స్య సంఘంలో సభ్యత్వం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గమంతా ఐకమత్యంతో మెలిగి, సభ్యుల సంక్షేమానికి, సంఘం అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

