పెన్షనర్ల గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్ యాప్ శిక్షణ
పారదర్శకత, వేగవంతమైన సేవలందించడమే లక్ష్యం
జూన్ 15 లోపు ప్రక్రియ పూర్తికి బల్దియా అధికారుల నిర్ణయం
వృద్ధులు, దివ్యాంగులకు తప్పనున్న ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు
కాకతీయ, వరంగల్ : చేయూత పెన్షనర్ల సజీవ నిర్ధారణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక అడుగు వేసింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారిత యాప్ వినియోగంపై వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పెన్షనర్లు జీవించి ఉన్నారని నిర్ధారించే లైవ్‌నెస్ సర్టిఫికేషన్‌ను ఇకపై ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ విధానంలో పెన్షనర్ల ముఖాన్ని స్కాన్ చేసి వివరాలను తక్షణమే నమోదు చేయవచ్చన్నారు. దీంతో మధ్యవర్తుల జోక్యం తగ్గి, ప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
జూన్ 15 లోపు పూర్తి కావాలి
శిక్షణలో భాగంగా వార్డు వారీగా సిబ్బందికి ప్రత్యేక లాగిన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వార్డులోని కమ్యూనిటీ హాళ్లు, వార్డు కార్యాలయాల్లోనే ఈ సజీవ నిర్ధారణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. చేయూత పెన్షనర్లందరి సజీవ నిర్ధారణ ప్రక్రియను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మార్పుతో వృద్ధులు, దివ్యాంగులైన పెన్షనర్లకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది తగ్గి, వారి ఇంటి దగ్గరే సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఉప కమిషనర్ సమ్మయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రేణుక, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస స్వామి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రేవతి, మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ రమేష్, శిక్షకులు పాల్గొన్నారు.

