గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి
ప్రతి సీటు భర్తీ కావాలి.. నిర్లక్ష్యానికి తావులేదు
జూన్ 12 నుంచి పాఠశాలల ప్రారంభం
వసతులపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
కాకతీయ, ఖమ్మం : రాబోయే విద్యా సంవత్సరానికి జిల్లాలోని గురుకుల పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సీపీ సునీల్ దత్‌లతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకులాల్లో అడ్మిషన్లు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సీట్లు పూర్తిగా భర్తీ కాని పాఠశాలలపై ప్రత్యేక అధ్యయనం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ప్రత్యేక నిఘా.. మౌలిక వసతులు
ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలకు ఒక జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించి, వారు ప్రతి నెల పాఠశాలను సందర్శించి నివేదిక సమర్పించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. అలాగే, వైద్యులు ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐదు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ భవనాల పనులను వేగవంతం చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలను వీటిల్లోకి మార్చేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
సొంత భవనాల్లో సోలార్ ప్యానెళ్లు
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, అద్దెలు క్రమం తప్పకుండా చెల్లిస్తోందని, నిధులు విడుదలవుతున్నందున పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. స్వంత భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానెల్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బిల్లులు ఇప్పటికే క్లియర్ చేశామని, విద్యాశాఖ పనుల కోసం అవసరమైతే డీఎంఎఫ్టీ నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

