ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కోనాయిమాకుల ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన
కాకతీయ, గీసుగొండ : కొనాయిమాకుల ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. మండలంలోని కాకతీయ కాలువపై నిర్మిస్తున్న కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చేయడానికే ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గీసుగొండ, సంగెం, దుగ్గొండి మండలాల రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చి వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, తహసిల్దార్ ఎండీ రియాజుద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

