కాంగ్రెస్ విజయానికి బీఎల్ఏలే కీలకం
ప్రతి బీఎల్ఏ ఒక సైనికుడిలా పనిచేయాలి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ
ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి: తోట దేవి ప్రసన్న
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే పాయం
కాకతీయ, మణుగూరు: కాంగ్రెస్ విజయానికి బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత కీలమని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాల్‌లో పినపాక నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ అగ్ర నాయకులు చేస్తున్న పోరాటం బూత్ స్థాయిలో సార్థకం కావాలని, ప్రతి బీఎల్ఏ ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల కుట్రలను, డబ్బు ప్రలోభాలను తిప్పికొట్టి పార్టీ జెండా ఎగరేయాలని ఆయన సూచించారు. తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి ప్రక్రియలను ఫారం-6, 7, 8 ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

ప్రజలకు వారధిగా పనిచేయాలి
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఎల్ఏలు కేవలం ఓటరు జాబితా పనులకే పరిమితం కాకుండా, పార్టీకి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

