- ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మాటలు
- బీఆర్ ఎస్ నేతల ఆగ్రహం..
కాకతీయ, కరీంనగర్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉందని, ఈ ఘటనపై చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)-2023లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని, చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రానికి అనుగుణంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ మినహాయింపు లేకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన ముఖ్యమంత్రి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్ట పరిపాలనను కాపాడేందుకు పోలీసు శాఖ నిష్పాక్షికంగా వ్యవహరించి, తమ ఫిర్యాదుపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

