మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులకు రివార్డు
అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రవి, వెంకటేష్
నగదు రివార్డు అందజేసిన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్
కాకతీయ, చేర్యాల: హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను అప్రమత్తంగా గుర్తించి, సురక్షితంగా తిరిగి హాస్టల్‌కు చేర్చిన చేర్యాల పోలీసు బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవి, వెంకటేష్‌లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ అభినందించారు. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవీయ దృక్పథంతో వ్యవహరించినందుకు గాను ఆ సిబ్బందికి సీపీ నగదు రివార్డు అందజేసి ప్రశంసించారు. శనివారం తెల్లవారుజామున ముస్త్యాల బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బాలురిని బ్లూ కోల్ట్స్ సిబ్బంది గుర్తించారు. విచారణలో వారు ముస్త్యాలలోని ప్రగతి విద్యానికేతన్ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నామని, హాస్టల్లో ఉండటం ఇష్టం లేక పారిపోయి వచ్చామని తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని క్షేమంగా హాస్టల్‌కు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి వార్డెన్‌కు అప్పగించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసుల బాధ్యతాయుతమైన పనితీరు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

