- మహదేవ్‌పూర్ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తాం
- ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం
- హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలు
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాకతీయ, మలహర్(మహదేవ్‌పూర్) : మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, శిధిలావస్థలో ఉన్న మహదేవ్‌పూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహదేవ్‌పూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ సహకారంతో ఎంఎన్‌జే ఆసుపత్రి హైదరాబాద్, ఒమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించి వైద్యులను శాలువాలతో సత్కరించారు. మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ప్రతి మహిళ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేదలు ఆర్థికంగా నష్టపోకుండా ముందస్తు వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించాలనే ఉద్దేశంతో ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆధునిక వైద్య సదుపాయాలు
హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలు వేగంగా నిర్వహించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. పరీక్షల అనంతరం అందించే కార్డు ద్వారా 5 సంవత్సరాల వరకు ఆరోగ్య నివేదికలు భద్రంగా ఉంటాయని చెప్పారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రాలు, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు ఈసీజీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటివరకు కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని, మంథని నియోజకవర్గంలో 45 వేల మందికి కంటి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

