- శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్ యజమాని కుటుంబంపై ఆరోపణలు
కాకతీయ, నల్లబెల్లి/తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై ఆయన సతీమణి పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సంపేటలోని శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్ యజమాని వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ, “నా భర్త మృతికి మీరే కారణం.. నా భర్తను పొట్టన పెట్టుకుంది మీరే” అంటూ కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన పెద్ది స్వప్న, తన భర్తను కోల్పోవడానికి వారే కారణమని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి పెద్ది స్వప్న చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. 2023 ఎన్నికలకు ముందు వీరమల్ల వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆర్థిక ఆరోపణలు చేస్తూ దీక్ష చేపట్టినట్లు సమాచారం.
ఊరురా బోర్లు వేయించిన పెద్ది.. తమకు ఇవ్వాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల తర్వాత పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో పెద్ది బోర్లు వేయించినట్లుగా, ఆ మొత్తం కాంట్రాక్ట్‌ను శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్‌కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బోర్ వెల్స్ మొత్తాలను పెద్ది చెల్లించలేదని ఆరోపిస్తూ ఎన్నికల సమయంలో వీరమల్ల వెంకట్‌రెడ్డి చేపట్టిన దీక్ష నియోజకవర్గంలో చర్చకు దారి తీసింది. పెద్ది ఓటమికి వీరు చేపట్టిన దీక్ష కూడా కారణమన్నది స్వప్న ఆరోపణగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

