ఏసీబీకి చిక్కిన ఇద్దరు
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, సీనియర్ అసిస్టెంట్ పట్టివేత
సీఎంఆర్‌ఎఫ్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్
రూ.2 లక్షల మంజూరుకు రూ.1.05 లక్షలు డిమాండ్
రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కాకతీయ, హైదరాబాద్ : సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన వైద్య రీయింబర్స్‌మెంట్ బిల్లును ప్రాసెస్ చేసేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటూ సచివాలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆనందేశి రాఘవేందర్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సీనియర్ అసిస్టెంట్ మెడి వినోద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి వైద్య రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌కు సంబంధించి రూ.2 లక్షలు మంజూరు చేయడంతో పాటు మిగిలిన బిల్లును ప్రాసెస్ చేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంతకుముందే రాఘవేందర్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి మెడి వినోద్ ద్వారా ఫోన్‌పేలో స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. గురువారం నిర్వహించిన ట్రాప్‌లో వినోద్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష తీసుకుని రాఘవేందర్‌కు అందజేశాడు. రాఘవేందర్ సూచన మేరకు అతడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు
ఇద్దరూ విధులను దుర్వినియోగం చేసి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులను ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

