కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి
మునిగిలవేడులో సీపీఎం నాయకుల రాస్తారోకో
కాకతీయ, నెల్లికుదురు : కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి రైతుల ఇబ్బందులను తీర్చాలని సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు. మండలంలోని మునిగిలవేడు గ్రామ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం ఆలస్యమవుతున్నందుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రంలో పోసుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో రైతులు వడ్లను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూక్య బిక్షపతి, బండ వెంకన్న, రైతులు ముఖేష్, కొండ ఉప్పలయ్య, రవి, బైసా రమేష్, రాస ఉపేందర్, కన్న సతీష్, తిప్పల సోమయ్య, తుప్పతురి వెంకన్న, యాకయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

