టీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకన్న మాదిగ
కాకతీయ, తుంగతుర్తి: తెలంగాణ ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పల్లేటి లక్ష్మణ్ మాదిగ గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ.. టీ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి మేడి పాపన్న నాయకత్వంలో వెంకన్న చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమ స్ఫూర్తితో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. అనంతరం వంగాల వెంకన్న మాదిగ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటించి పకడ్బందీగా కమిటీలను ఏర్పాటు చేస్తానని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని పేర్కొన్నారు. మాదిగలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడటంతో పాటు, వారికి ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకు జానయ్య మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ చింత సైదులు మాదిగ, తుంగతుర్తి ఇంచార్జ్ పాల్వాయి సూరయ్య మాదిగ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా నాయకులు మొండికత్తి లింగయ్య, పాల్వాయి శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

