టెక్స్టైల్ పార్కుకు కేంద్రం ఊతం
తొలి విడతగా రూ.30 కోట్లు విడుదల
లోక్సభలో ఎంపీ కడియం కావ్య వినతిపై కేంద్రం స్పందన
వరంగల్ అభివృద్ధిలో మరో ముందడుగు
కాకతీయ, హనుమకొండ: వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్కు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక సహకారం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో రూల్ 377 కింద చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. పీఎం మిత్ర పథకం కింద ఈ ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. మెగా టెక్స్టైల్ పార్కును త్వరితగతిన పూర్తి చేయాలని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ కడియం కావ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి, ఇప్పటికే రూ.30 కోట్ల తొలి విడత నిధులను విడుదల చేసినట్లు ప్రకటించారు. మిగిలిన నిధులను అర్హతల ప్రాతిపదికన తదుపరి విడతల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
భారీగా ప్రోత్సాహకాలు..
పరిశ్రమలను ఆకర్షించేందుకు సుమారు రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. పీఎల్ఐ, సమర్థ్ వంటి పథకాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లు లబ్ధి పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య నిరంతర కృషితో ఈ ప్రాజెక్టుకు నిధులు రావడంపై స్థానిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టెక్స్టైల్ పార్క్ అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రాంతంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధి వేగవంతం కానుంది.

