మధిరను ‘మోడల్’గా తీర్చిదిద్దుతాం
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది
భవిష్యత్తు అవసరాలకు కొత్తగా సబ్‌స్టేషన్ల నిర్మాణం
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయం కల్పిస్తాం
అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కేటాయింపు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం మండలంలో అభివృద్ధి పనులకు శంకు స్థాపన
కాకతీయ, ఖమ్మం బ్యూరో/ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపి, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎర్రుపాలెం మండలంలో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువైన నూతన రహదారులు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ప్రముఖ ఆలయ పునర్నిర్మాణ పనులకు వరుసగా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు. ఎక్కడా నిధుల కొరత లేకుండా పనులన్నీ వేగంగా పూర్తి చేస్తామని, ముఖ్యంగా దళితవాడల రూపురేఖలు మార్చేందుకు ఎస్సీ కాలనీల్లో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
మౌలిక వసతులకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పన ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రధాన రహదారులతో పాటు మారుమూల గ్రామాల అనుసంధానానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పర్యటనలో భాగంగా గోసవీడు గ్రామం నుండి రామకృష్ణాపురం వరకు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన తారు రోడ్డు పనులకు, ముప్పై ఐదు లక్షల రూపాయలతో గోసవీడు ఎస్సీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్లకు, మరో రెండు కోట్ల రూపాయలతో రామన్నపాలెం నుండి కట్లేరు చెరువు వరకు తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇనగాలి గ్రామంలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సైదెల్లిపురం రహదారి, మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సిద్ధినేనిగూడెం రహదారి పనులతో పాటు ముప్పై ఒక్క లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ సిమెంట్ రోడ్ల పనులను ప్రారంభించారు. ములుగుమాడు గ్రామంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నాగవరప్పాడు రహదారి, మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో సైదేల్లిపురం రహదారి, అరవై మూడు లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. తక్కెలపాడు గ్రామంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో మధిర రహదారి వరకు నిర్మించే తారు రోడ్డు పనులకు, అరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ అంతర్గత సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల పురోగతికి ప్రాధాన్యత ఇస్తూ ములుగుమాడులో కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో చేపట్టిన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
విద్యుత్ రంగంలో నూతన విప్లవం
భవిష్యత్తు కాలంలో రాబోయే విద్యుత్ అవసరాలను ముందే ఊహించి, దానికి అనుగుణంగా మధిర నియోజకవర్గంలో విద్యుత్ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పెద్దగోపవరం గ్రామంలో నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ ఎర్రుపాలెం సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు, జమలాపురం గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా స్థానిక రైతులకు సాగునీటి కొరత లేకుండా, గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని భరోసా ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వశక్తి మహిళా సంఘాల ద్వారానే సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నామని, దీని ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

