మొబైల్ శిలాఫలకాలతో ప్రజలను మోసం చేశారు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఐదు గ్రామాల రోడ్ల దుస్థితిపై మేడపల్లి క్రాస్ వద్ద ధర్నా
కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలోని మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేడపల్లి క్రాస్ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనులను ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ కక్షసాధింపుతో అడ్డుకుంటున్నారని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిని నిలిపివేశారని విమర్శించారు. ఇప్పటికే మంజూరైన బీటీ రోడ్లను రద్దు చేయడంతో పాటు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను బెదిరించి బిల్లులు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

మొబైల్ శిలాఫలకాలతో డ్రామాలు..
ఎన్నికల సమయంలో మొబైల్ శిలాఫలకాలతో పర్యటించి, ఒకే రోజు అనేక శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే, ఆ పనులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకు సమాధానం చెప్పాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సొంత నిర్మాణ సంస్థలకు అనుకూలంగా టెండర్లను మలచుకుంటూ, నాణ్యత లేని పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మేడపల్లి ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో 10 వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గోదావరి జలాల సరఫరాను అడ్డుకోవడం వల్ల చెరువులు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయపోరాటం చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల సహకారంతో చందాలు సేకరించి రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

