- రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం కల్పించాలి
- అమరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించాల
- అర్హులైన ఉద్యమకారుల అధికారిక జాబితాను తక్షణమే ప్రకటించాలి
- ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
- ఉద్యమకారుల సమస్యలపై 17న కేకే కమిటీకి వినతిపత్రం
- తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
కాకతీయ, హన్మకొండ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం 5,000 కోట్ల నిధితో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, శాశ్వత సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ళ రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొన్న వారు, బైండోవర్ అయిన వారు, గాయపడిన వారు, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారుల అధికారిక జాబితాను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, సంక్షేమం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు. గత 12 ఏళ్లలో సుమారు 1,200 మంది ఉద్యమకారులు ఆర్థిక, ఆరోగ్య సమస్యల కారణంగా కాలం చెల్లారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉద్యమకారులకు పెన్షన్, ఆరోగ్య కార్డులు, గ్రూప్ డీ ఉద్యోగాల్లో 5 నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించారు. మన రాష్ట్రంలో మాత్రం ఉద్యమకారులను విస్మరించడం సరికాదు. భారత స్వాతంత్ర్య సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసిన తరహాలోనే తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులకు సామాజిక భద్రత, ఆర్థిక ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉంది.
శాశ్వత సంక్షేమ నిధిని రూపొందించాలి
కేవలం సంక్షేమ పథకాలతో సరిపెట్టకుండా 5,000 కోట్ల నిధితో ప్రత్యేక ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, శాశ్వత సంక్షేమ నిధిని రూపొందించాలి. ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25 వేల పెన్షన్, ఉచిత బస్సు పాస్, ఆరోగ్య బీమా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు, విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు. ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల తరఫున సంక్షేమం, గుర్తింపు ప్రక్రియపై సలహాలు, సూచనలతో కూడిన వినతిపత్రాన్ని కేకే కమిటీకి అందజేయనున్నామని వెల్లడించారు.
ముందు వరుసలో నిలిచిన ఉద్యమకారుల సమస్యలు
ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలి. ఉద్యమకారులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు పడాలి. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో ఉద్యమకారుల ఐక్య వేదిక అడ్హాక్ కమిటీ సభ్యులు వొడపెల్లి శ్యామ్కృష్ణ, బొలిశెట్టి అశోక్, చాంద్ పాషా, మనోహర్ రావు, ఎం.డీ. ఖదీర్, దాసరి జనార్దన్, టీన్ స్వామి, చెన్నూరి నటరాజ్, మొలంగూరి నెల్సన్, ముగుసల దేవేందర్ రెడ్డి, మీర్జా అంజాద్, సువర్ణలత, గోపనబోయిన రాజు, ఐమాడిశెట్టి రాజు, యేడునూరి రాజమౌళి, జక్కుల స్వామి, యాదవ్, షేక్ దస్తగిరి, మాస్క్ కరుణాకర్, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

