సింగరేణిని విస్తరిస్తాం
గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగాల్లోకి అడుగుపెట్టాలి
ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం
పోటీ ప్రపంచంలో సంస్థను మరింత బలోపేతం చేయాలి
బొగ్గు నాణ్యత, ఉత్పాదకతపై ప్రత్యేక దృష్టి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెంలో సింగరేణి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరింత బలోపేతం చేయడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో) ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
పోటీని తట్టుకునేలా ప్రణాళికలు
తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిదే ఏకఛత్రాధిపత్యమని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను బహిరంగ వేలానికి తెచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థల నుంచి తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణపై దృష్టి పెడితేనే సంస్థ భవిష్యత్తు మరింత బలపడుతుందని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అగ్రస్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ పెరుగుతున్న పోటీని ఎదుర్కోలేక వెనుకబడిన విషయాన్ని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు.

నాణ్యమైన బొగ్గే సంస్థకు బలం
జెన్కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని భట్టి స్పష్టం చేశారు. తవ్వకాల సమయంలో మట్టి, రాళ్లు, ఇతర మలినాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బొగ్గు వాషింగ్ చేసి యాష్ కంటెంట్ తగ్గించాలని అధికారులకు సూచించారు. గ్రేడ్–4, గ్రేడ్–5, గ్రేడ్–6 ప్రమాణాల ప్రకారం శాస్త్రీయంగా బొగ్గును బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచవచ్చన్నారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొంటూ, సంస్థ అభివృద్ధిని ప్రతి ఉద్యోగి తన కుటుంబ బాధ్యతగా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గని స్థాయిలో అధికారులు, కార్మికులు సమావేశాలు నిర్వహించి ఉత్పాదకత పెంపుపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
కొత్త బ్లాకులు.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి
గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని పేర్కొన్న భట్టి, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బొగ్గు బ్లాకులను వేగంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల–2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించినట్లు తెలిపారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నందున సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోనూ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి క్రిటికల్ ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌లోనూ ప్రవేశించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో క్రిటికల్ మినరల్స్ బ్లాకుల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సింగరేణిలో ఉన్న మైనింగ్ నిపుణుల అనుభవాన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో వినియోగించి సంస్థకు కొత్త ఆదాయ వనరులు సృష్టించాలని పేర్కొన్నారు. ఇకపై సింగరేణి బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, భవిష్యత్ అభివృద్ధి వ్యూహాలపై చర్చించే వేదికగా మారాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల తరహాలో స్పష్టమైన లక్ష్యాలు, కాలపట్టికతో పనులు పూర్తి చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, జెన్కో ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

