మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించాలి
చింతకాని పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గజ్జెల నరేష్
కాకతీయ, ఖమ్మం టౌన్: మానవ అక్రమ రవాణాపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని చింతకాని పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గజ్జెల నరేష్ సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ గజ్జెల నరేష్ పాల్గొని మానవ అక్రమ రవాణా దుష్పరిణామాలు, పిల్లలు, మహిళలు ఎదుర్కొనే ప్రమాదాలు, అపరిచితుల మాటలను నమ్మకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పిల్లల భద్రత కోసం కుటుంబ సభ్యులు, పాఠశాలలు, పోలీసులు, సమాజం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గజ్జెల నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మానవ అక్రమ రవాణాపై చైతన్యం పెంపొందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు శాఖ సిబ్బంది, శ్రీ రక్ష హాస్పిటల్ బృందం సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

