- ఈ-కేవైసీ చిక్కులతో వేలాది కుటుంబాలకు టెన్షన్
- దేళ్లలోపు పిల్లలకు నిలిచిన బయోమెట్రిక్ ప్రక్రియ
- గడువు సమీపిస్తున్న వేళ తల్లిదండ్రుల ఆవేదన
కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ లో పారదర్శకత పెంచేందుకు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డులో సభ్యులుగా నమోదైన ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ-కేవైసీ చేయించే అవకాశం లేకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు సమీపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయారు. ఇంటర్నెట్ సమస్యలు, బయోమెట్రిక్ పరికరాల కొరత, అవగాహన లోపం, దూర ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు లేకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
చిన్నారులకే పెద్ద సమస్య
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో కేవలం ఫోటో, జనన వివరాలు మాత్రమే నమోదు చేస్తారు. వేలిముద్రలు, కంటి ఐరిస్ బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. దీంతో ప్రస్తుతం అమలవుతున్న బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా రేషన్ కార్డులో నమోదైన చిన్నారుల పేర్లు తొలగించబడతాయేమోనని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులో నుంచి చిన్నారుల పేర్లు తొలగిపోతే వారికి లభించే ఉచిత బియ్యం, ఇతర ప్రజా పంపిణీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలన్న డిమాండ్
ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బయోమెట్రిక్ అవసరం లేకుండా ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతిని అమలు చేయాలని, పిల్లల పేర్లు తొలగించకుండా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ-కేవైసీ గడువును కూడా పొడిగించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు.

