ప్రాణానికి మించినది ఏదీ లేదు
భద్రతలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి
రోడ్డు భద్రతపై అవగాహన పెంపు అవసరం
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ములుగు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రాణానికి మించినది ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకుంటూ సురక్షితంగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ శివారులోని ఎం.ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలమన్నారు. వేగంగా గమ్యానికి చేరుకోవాలనే తొందరలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత వేగ పరిమితులను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సురక్షిత ప్రయాణమే నిజమైన విజయానికి దారి తీస్తుందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన అవసరం
మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ అధికారులు రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి, హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని వివరించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు.

