డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు
కరీంనగర్లో 140 టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు సీజ్
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు
వాహనదారులకు పోలీసుల కౌన్సెలింగ్
కాకతీయ, కరీంనగర్: పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం పట్టణవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని 140 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి, రహదారి భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించారు.
నిరంతరం తనిఖీలు కొనసాగుతాయి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది చట్టరీత్యా నేరమని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ప్రతి వాహనదారుడు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఆర్సీ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు.

