ఆర్టీసీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలి
మహాలక్ష్మి పథకం బకాయిలు రూ. 400 కోట్లు విడుదల చేయాలి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్
డిపోలో సమ్మె శిబిరానికి ఏఐటీయూసీ సంఘీభావం
కాకతీయ, కోరుట్ల : ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా బుధవారం కోరుట్ల ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయడంతో పాటు, 2025 వేతన సవరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించాల్సిన రూ. 400 కోట్లను ఆర్టీసీకి విడుదల చేసి సంస్థను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు.
యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి
ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాములు డిమాండ్ చేశారు. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హితవు పలికారు. ఆర్టీసీ జేఏసీ నిరవధిక సమ్మెకు దిగడంతో సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె విరమింప చేయాలని, లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా నేత తిరుపతి నాయక్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు చింత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

