టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరికి ప్రమాదం
రోడ్డుపైనే బోల్తా కొట్టిన ఫార్చునర్ కారు
కాకతీయ, ఖమ్మం టౌన్ : పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చడం, రోడ్డు పక్కన చెట్లకు నిప్పు పెట్టడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే మరో ఘోర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల తాకిడికి ఆ చెట్టు లోపల పూర్తిగా కాలిపోయి బలహీనపడింది. సరిగ్గా ఏలూరి శ్రీనివాసరావు కారు ఆ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఆ చెట్టు భారీ కొమ్మ విరిగి కారుపై పడింది. దీంతో నియంత్రణ కోల్పోయిన ఫార్చునర్ కారు రోడ్డుపైనే బోల్తా కొట్టింది. కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయి వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పెద్ద ప్రాణాపాయం తృటిలో తప్పింది. పంట కోతల తర్వాత చేలల్లో మిగిలిన వ్యర్థాలను, గడ్డిని తగలబెట్టడం వల్ల ఆ మంటలు రోడ్డు పక్కన ఉన్న చెట్లకు వ్యాపిస్తున్నాయి. పచ్చని చెట్లను, రోడ్డు పక్కన నీడనిచ్చే మహావృక్షాలను కాల్చడం వల్ల అవి లోపల గుల్లబారి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజల చిన్న నిర్లక్ష్యం రోడ్డుపై వెళ్లే అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పంట పొలాలను, రోడ్డు పక్కన ఉన్న చెట్లను తగలబెట్టే అలవాటును మానుకోవాలని, ప్రకృతిని రక్షించి తోటి మానవుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

