కళాశాలలో కారు టెస్ట్ డ్రైవ్.. ప్రమాదం..!
పని వేళల్లో టయోటా కారు టెస్ట్ డ్రైవ్ చేసిన అధ్యాపకురాలు
ప్రమోషన్ల పేరుతో ప్రిన్సిపాల్ అత్యుత్సాహం?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కళాశాలలో విద్యాబోధన సాగాల్సిన సమయంలో కారు టెస్ట్ డ్రైవ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లంచ్ బ్రేక్ సమయంలో కాకతీయ టయోటా సంస్థకు చెందిన కారును ప్రమోషన్ పేరుతో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా అధ్యాపకురాలు ప్రమాదానికి గురయ్యారు. ప్రిన్సిపాల్ అనుమతితో కళాశాల ప్రాంగణంలోనే టెస్ట్ డ్రైవ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో టీఎస్/టీజీ003/టీసీ/55 ట్రేడ్ నంబర్ కలిగిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. విద్యార్థులు తరగతుల్లో ఉండాల్సిన సమయంలో కారు ప్రమోషన్ నిర్వహించడం, ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని కంపెనీ ప్రయోజనాలకు వినియోగించడం, సుమారు రూ.30 లక్షల విలువైన టెస్ట్ డ్రైవ్ కారు దెబ్బతినడానికి బాధ్యత ఎవరిదనే అంశాలపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు విచారణ జరపాల్సి ఉంది. ప్రమాదంలో అధ్యాపకురాలికి, విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.
డీఐఈవోపై ఆరోపణలు
ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కారేపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అటెండర్‌గా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యనారాయణ ఆరోపించారు. జిల్లాలో అనేక కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా డీఐఈవో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సుదీర్ఘకాలంగా ఖమ్మం జిల్లాలోనే విధులు నిర్వహించడం వల్ల ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని, అందుకే చర్యలకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టెస్ట్ డ్రైవ్ పేరుతో జరిగిన ఘటనపై అధ్యాపకురాలు, ప్రిన్సిపాల్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు దామల్ల సత్యనారాయణ తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

