రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?
కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్ఎస్ సమరం
కేటీఆర్ నేతృత్వంలో తుక్కుగూడకు ఎమ్మెల్యేలు
అన్నదమ్ములకు వందల కోట్ల భూములా?
ప్రజలకు సంక్షేమం చేయడానికి పైసల్లేవా?
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ మాయాజాలం
ప్రభుత్వ భూముల కేటాయింపుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి టెస్సెరాక్ట్ కంపెనీ కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిని మార్కెట్ విలువకు కాకుండా ఇంత తక్కువ ధరకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా, ప్రయోజనాల సంఘర్షణ కాదా, కుటుంబ పాలన కాదా అని నిలదీశారు. ఈ భూకేటాయింపును నిరసిస్తూ గురువారం కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తుక్కుగూడకు చేరుకుని భూమిని పరిశీలించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకే ఎలా?
ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..! ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటే కేవలం రూ.7 కోట్లకే ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. భూకేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను మార్కెట్ విలువకు కాకుండా తక్కువ ధరకు కేటాయించడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మరోవైపు అనుముల జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన సంస్థకు రూ.1,000 కోట్ల పెట్టుబడి పేరుతో ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు కల్పించే వ్యవహారంపైనా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఒకవైపు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్‌రెడ్డి.. ఇద్దరి మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం.. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు ఇవ్వాలా అని నిలదీశారు.
అన్నదమ్ములకు వందల కోట్ల ప్రయోజనాలా?
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు, పెట్టుబడి ప్రయోజనాలు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కుటుంబ పాలన కాదా, ప్రయోజనాల సంఘర్షణ కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రూ.250 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇంత పెద్ద భూకేటాయింపు వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఈ రంగాల్లోనూ అధికారానికి దగ్గరగా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.
సభలో గొంతు నొక్కారు.. అందుకే ఇక్కడికి వచ్చాం
శాసనసభలో భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తామనే తమను సస్పెండ్ చేసి బయటకు పంపారని కేటీఆర్ అన్నారు. సభలో తమ గొంతు నొక్కారని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామనే భయంతోనే బయటకు పంపారని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి సోదరుడికి కేటాయించిన భూమి వద్దకు వచ్చి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకమని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పెట్టుబడిదారులు బలిపశువులు కావొద్దు
ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో కోర్టుల్లో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలేనని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యవహారంలో పెట్టుబడిదారులు బలిపశువులు కావద్దని సూచించారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము రూ.1 లక్ష మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే రూ.200 కోట్ల విలువైన స్థలం ఇస్తారా? తమకూ అదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతి గ్రామంలో సదస్సులు
ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అవసరమైన అన్ని న్యాయ, ప్రజాస్వామ్య మార్గాలను అన్వేషించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం చూపిస్తున్న రంగుల కల వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలను కూడా మీడియా ప్రజలకు వివరించాలని కేటీఆర్ కోరారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉన్న అంశాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూముల విషయంలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాల్సిందేనని పేర్కొంటూ.. ఈ భూవ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

