చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా!
పెరుగుతున్న సివిల్, క్రిమినల్ కేసుల భారం
పెండింగ్ కేసుల వివరాలు పరిశీలించి చర్యలు
బార్ అసోసియేషన్ వినతిపై సానుకూల స్పందన : జస్టిస్ కె. శరత్
కాకతీయ, చేర్యాల: చేర్యాల కోర్టులో అదనపు కోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. కేసుల సంఖ్య పెరుగుతూ పెండింగ్ భారం అధికమవుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ఞప్తిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ సానుకూలంగా స్పందించారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జువైనల్ కోర్టు ప్రారంభోత్సవానికి హాజరైన ఆయనను చేర్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి అదనపు కోర్టు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ శరత్ హామీ ఇచ్చారు. అదనపు కోర్టు ఏర్పాటైతే కేసుల పరిష్కారం వేగవంతమై ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం న్యాయమూర్తిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య, ఉపాధ్యక్షుడు కాటం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

