సర్పంచులు పట్టుదలతో పనిచేయాలి
గ్రామాల అభివృద్ధిపై ప్రణాళికతో ఉండాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ : గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు పర్యవేక్షణ, పట్టుదలతో పని చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కార్యక్రమాన్ని “జయ జయ హే తెలంగాణ” రాష్ట్ర గీతంతో ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో పది కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాల యాల్లో ఫైళ్ల త్వరిత పరిష్కారం, ఆరోగ్యం,అరైవ్ అలైవ్ ద్వారా సురక్షిత ప్రయాణం,సంక్షేమ పథకాలు,పిల్లల భద్రత సంరక్షణ, డ్రగ్ నియంత్రణ,వ్యవసాయం, విద్య,యువత క్రీడలు, మహిళలు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఈ పది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ, పట్టుదల,ప్రశ్నించే తత్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసమే వినియోగించ బడుతుందని పేర్కొంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు.ఎలాంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-3424కు సంప్రదించాలని సూచించారు.ఈ నంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత ఆసుపత్రుల్లో వాయిస్ రికార్డింగ్ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. అనవసర ఖర్చులు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించు కోవాలని ప్రజలకు సూచించారు.ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని,ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం సురక్షిత రోడ్డు ప్రయాణాలపై ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్,సిఐ డి.విశ్వేశ్వర్,21 గ్రామాల సర్పంచులు,వివిధ శాఖల అధికారులు,మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

