రామప్ప అస్తిత్వానికే ముప్పు
ఓపెన్‌కాస్ట్ బొగ్గుబావిని రద్దు చేయాలి
ప్రపంచ వారసత్వ కట్టడానికి పొంచి ఉన్న ప్రమాదం
22 గ్రామాల వ్యవసాయం, మత్స్యకారుల ఉపాధిపై నీలినీడలు
తక్కువ కాలం వచ్చే బొగ్గుకు శతాబ్దాల చరిత్ర బలి
సింగరేణి యాజమాన్యంపై రామప్ప కమిటీ ఆగ్రహం
కాకతీయ, ములుగు ప్రతినిధి : యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు ముప్పుగా పరిణమించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గుబావి ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని రామప్ప దేవాలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆగిరెడ్డి వెంకటరామ మోహన్‌రావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం ఈ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్లు ప్రకటించకపోతే, ప్రభావితమయ్యే 22 గ్రామాల ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఆలయ భద్రతపై ఆందోళన
ఇసుక పునాదులపై నిర్మితమైన రామప్ప ఆలయం అపూర్వ శిల్పకళా సంపదకు నిలయమని, అలాంటి కట్టడం సమీపంలో భారీ బ్లాస్టింగ్‌లు, భూగర్భ తవ్వకాలు చేపట్టడం అంటే దాని అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2009–10లో ఏర్పడిన ముప్పును అప్పటి ప్రజా ఉద్యమంతో అడ్డుకున్నామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆయన గుర్తు చేశారు. ఇక మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రామప్ప చెరువు, భూగర్భ తవ్వకాల వల్ల లీకేజీలకు గురై ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ చెరువుపైనే సుమారు 30 వేల ఎకరాల సాగుభూములు, వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధి ఆధారపడి ఉన్నాయని, దీనికి నష్టం జరిగితే దిగువ ప్రాంతాల నీటి వ్యవస్థలు కుప్పకూలుతాయని స్పష్టం చేశారు. కేవలం 14 నుంచి 18 ఏళ్ల తవ్వకాల కోసం ప్రపంచ వారసత్వ సంపదను బలి ఇవ్వడం సమంజసం కాదని, సింగరేణి అధికారులు శాస్త్రీయ ఆధారాలను ప్రజల ముందుంచాలని, లేనిపక్షంలో ప్రాజెక్టును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

