అనుమతులు గోరంత.. తవ్వకాలు చెరువంతా
దుగ్గొండి మండలంలో యథేచ్ఛగా మొరం దందా
చెరువులను చేరబెడుతున్న అక్రమ తవ్వకాలు
లోతైన గుంతలతో ప్రమాదపు అంచున పల్లె చెరువులు
రాయల్టీ ఎంత..? తవ్వకాలు ఎంత..? అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, వాగుల పరిధిలో మొరం తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి అనుమతులు తీసుకుని, వాటిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున మొరం తవ్వి లారీల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పల్లె చెరువుల స్వరూపం మారిపోతుండగా, వర్షాకాలంలో ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పరిధిలో భారీ యంత్రాలతో తవ్వకాలు జరగడంతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాల సమయంలో ఈ గుంతల్లో నీరు నిలిచి పశువులు, చిన్నారులు ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల కట్టల భద్రతపైనా ప్రభావం పడే అవకాశముందని పేర్కొంటున్నారు.
రాయల్టీ ఒకటి తవ్వకాలు మరొకటా
ప్రభుత్వం నిర్దేశించిన మేరకే రాయల్టీ చెల్లిస్తున్నారా ఇచ్చిన అనుమతుల మేరకే మొరం తవ్వుతున్నారా లేక పరిమితికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమతుల వివరాలను బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మొరం తవ్వకాల అనుమతుల విషయంలో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నారా లేక కొందరికే పరిమితం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.
స్పందించని ఇరిగేషన్ డీఈ
ఈ అంశంపై వివరణ కోసం ఇరిగేషన్ శాఖ డీఈని సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. శాఖ అధికారిక వివరణ కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. మొరం తవ్వకాలకు ప్రభుత్వానికి ఎంత రాయల్టీ చెలఅక్రమ తవ్వకాలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చెరువులను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

