న్యాయం కోసం వెళ్తే..
పోలీస్ స్టేషన్లో ‘రైతు’పై ఎస్ఐ దౌర్జన్యం!
పంటను కాపాడమంటే.. ఫిర్యాదుదారుడినే కొట్టిన ఎస్ఐ!
100కు డయల్ చేసిన పాపానికి మొబైల్ లాక్కుని బూతులు
బాధితుడిపైనే దాడి.. స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలంటున్న రైతు
వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్‌లో కలకలం
కాకతీయ, నిఘా ప్రతినిధి : చట్టాన్ని నమ్ముకొని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. తన పంటను ఎవరో నాశనం చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిని, ఎస్ఐ తీవ్రంగా దూషించడమే కాకుండా.. స్టేషన్లోనే దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎవరికి న్యాయం దొరుకుతుందని బాధితుడు తోగారు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ అసలు కథ?
దేశాయిపల్లి గ్రామానికి చెందిన తోగారు రాజుకు చెందిన సర్వే నంబర్లు 436/4, 436/6, 436/7లో గల 0-22 గుంటల భూమిని ఆయన తండ్రి కట్టమల్లు గతంలో చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అప్పటి నుండి అదే భూమిని సాగు చేసుకుంటున్న రాజు, ప్రస్తుతం అందులో కంది, మక్కజొన్న పంటలు వేశారు. అయితే మంగళవారం అదే గ్రామానికి చెందిన తోగారు అశోక్, మాణిక్యాల రాజులు అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, పంటపై గడ్డి మందు (హెర్బిసైడ్) పిచికారీ చేశారు. ఈ దుశ్చర్య వల్ల పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చి, కుటుంబ జీవనాధారం దెబ్బతిందని రాజు వాపోయారు.
“100కు ఫోన్ చేసినందుకు కొట్టారు”
ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాజు మొదట 100కు డయల్ చేయగా, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో రాజు దుగ్గొండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐని కలిశారు. అయితే, ఎస్ఐ తనను వివరాలు అడగడానికి బదులు.. ఎందుకు 100కు ఫోన్ చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని రాజు ఆరోపించారు. స్టేషన్లోనే అసభ్య పదజాలంతో దూషిస్తూ, తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారని, చెంపదెబ్బలు కొట్టి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేయడానికి వచ్చిన తననే నిందితుడిలా చూశారని రాజు కన్నీటి పర్యంతమయ్యారు.
“సీసీటీవీ ఫుటేజీని పరిశీలించండి”
పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ మొత్తం వ్యవహారం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డై ఉంటుందని, ఉన్నతాధికారులు వాటిని స్వాధీనం చేసుకుని నిష్పాక్షికంగా విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని రాజు డిమాండ్ చేస్తున్నారు. తనలాంటి సామాన్య రైతుకు చట్టంపై నమ్మకం ఉండేలా వరంగల్ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని, తనపై దాడి చేసిన ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఐ వివరణ..
ఈ ఘటనపై దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐని వివరణ కోరగా.. “అలాంటి విషయం ఏదీ నా దృష్టికి రాలేదు. అది అవాస్తవం” అని ఆయన సమాధానమిచ్చారు. ఒకవైపు బాధితుడు కన్నీరుమున్నీరవుతుంటే, మరోవైపు సీఐ ఆ ఘటనను కొట్టిపారేయడంపై స్థానికంగా విమర్శలు వస్తు న్నాయి. పోలీసులే న్యాయం చేయకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలని స్థానిక గ్రామస్థులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, బాధితుడికి న్యాయం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

