రైతులను తక్షణమే ఆదుకోవాలి!
వరంగల్ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్
జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
కాకతీయ, రాయపర్తి: వర్షాభావం, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం రాయపర్తిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డితో కలిసి వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వం వెంటనే అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి నష్టపరిహారం అందించాలని ఎర్రబెల్లి కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ఏనుగుల రాకేష్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. అర్హులైన పట్టభద్రులందరూ నవంబరు 6లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాయపర్తిని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

