జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి!
కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్పష్టత
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
కాకతీయ, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో కులగణన చేపట్టి, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు. గతంలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ, ఆగస్టు 14న వెల్లడించిన 40 ప్రశ్నల్లో ఓబీసీ కాలమ్ లేదని పేర్కొన్నారు. కులాలవారీ జనాభా వివరాలు ఉంటేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచడం, బడ్జెట్ కేటాయింపులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు స్పష్టత వస్తుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, త్వరలో తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఓబీసీ కాలమ్ కోసం కోరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ శాసనసభ ఇప్పటికే కులగణనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

