అన్ని రంగాల్లోనూ ‘కాంగ్రెస్’ విఫలం
మళ్లీ పాత రోజులు దాపురించాయి!
తులం బంగారం ఇంకెప్పుడిస్తారు?
కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల్లో నిరాశ.. కేసీఆర్ ఇచ్చిన లక్షే దిక్కు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు.. కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తం
కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలతో అల్లాడుతున్న ప్రజలు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కాకతీయ, సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు మరియు అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోందన్నారు. “కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలే అందుతున్నాయి తప్ప, కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం జాడ ఎక్కడ? ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న మాటను త్వరగా నిలబెట్టుకోవాలి. దీనిపై ఇప్పటికే మహిళల్లో తీవ్ర చర్చ జరుగుతోంది” అని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సెగ – ప్రభుత్వ పాపమే!
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారంటే అది కాంగ్రెస్ చేసిన పాపమేనని జగదీష్ రెడ్డి విమర్శించారు. “కార్మికుల సమస్యలను గాలికొదిలేయడం వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మరణాలకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలి” అని పేర్కొన్నారు. ధాన్యం, మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆకాశంలో మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. అకాల వర్షాలు పడకముందే కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి. పేరుకే సెంటర్లు ప్రారంభిస్తున్నారు కానీ, కొనుగోళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు గత్యంతరం లేక దళారుల చేతిలో మోసపోతున్నారు. కేసీఆర్ గారి కంటే ముందున్న దళారీ వ్యవస్థే మళ్లీ రాష్ట్రంలో దాపురించింది” అని ఎద్దేవా చేశారు.
అంధకారంలో రాష్ట్రం..
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హామీల అమలుపై, అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

