బల్దియా గ్రీవెన్స్.. అధికారులకు అర్ధదిన సెలవు!
11 నుంచి 1 వరకే ప్రజావాణి.. ఆ తర్వాత అధికారుల జాడేది?
దరఖాస్తులతో తిరుగుతున్న బాధితులు.. పరిష్కారం ఎక్కడ?
ఐఏఎస్ అధికారిని నియమించాలంటున్న నగర ప్రజలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న బల్దియా గ్రీవెన్స్‌పై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అధికారులు ప్రజావాణికి హాజరవుతున్నారని, అనంతరం కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ తనిఖీలు, సమావేశాల పేరుతో అధికారులు వెళ్లిపోతుండటంతో దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతోందని వాపోతున్నారు. ఇంటి నంబర్ తొలగించి మరొకరికి కేటాయించారని ముగ్గురు వ్యక్తులు రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. మరో కేసులో ఒక సర్వే నంబర్‌పై ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించినప్పటికీ సంబంధం లేని మరో సర్వే నంబర్‌పై ఉన్న కోర్టు కేసు ఓఎస్ నంబర్ 2998/2022ను చూపించి దరఖాస్తును రద్దు చేశారని బాధితులు ఆరోపించారు. పలు కాలనీల్లో రెండు, మూడు నెలలుగా తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సమస్యపై పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా స్పందన లేదని వాపోతున్నారు. బల్దియాకు పట్టు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమిస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పలువురు కోరుతున్నారు.

