epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!
చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి
టీడీపీలో ఆది నుంచి అన్నింటా కీల‌క‌మ‌య్యాను
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా విజ‌యం వెనుక ఉన్న‌ది ప్ర‌జ‌ల అభిమాన‌మే
ఎంపీగా మాత్రం ఊహించని విజయం సొంతం
లక్ష్మీపార్వతి ‘వడ్డాణం’ అడిగారు.. అందుకే మంత్రి పదవి వద్దన్నా
పాల‌కుర్తిలో మాస్క్ పెట్టుకుని స‌ర్వే చేసుకున్నాకే అక్క‌డికి వెళ్లా
డీలిమిటేషన్‌ తర్వాత ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా..
వారసులను మాత్రం రాజ‌కీయాల్లోకి దింపను
డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌లో మాజీమంత్రి ఎర్ర‌బెల్లి ఆస‌క్తిక‌ర అంశాల వెల్ల‌డి

రాజకీయాల్లోకి రావాలని నేను ముందే నిర్ణయించుకున్నది కాదు.. పరిస్థితులే నన్ను ఆ దారిలోకి తీసుకొచ్చినయి. మా నాన్న రాజకీయాల్లో ఉండేవాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఎదురైన కక్షసాధింపులు నాలో కసి పెంచినయి. అయితే చిన్నప్పటి నుంచే నాకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. పదో తరగతిలోనే స్కూల్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ పెడుతున్నాడని తెలిసి వ‌రంగ‌ల్ నుంచి నాలుగు జీపుల్లో కార్యకర్తలను తీసుకొని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి క‌లిసిన‌. అక్కడ ఆయన పలకరించి తన కారులో న‌న్ను ఆయ‌న‌తోపాటు ఓ మీటింగ్‌కు తీసుకెళ్లారు. అలా మొదలైన పరిచయం టీడీపీ ఏర్పాటు, జెండా రూపకల్పన వరకు వెళ్లింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజల మధ్య పనిచేసిన. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన. నా రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ తలుచుకుంటే ఆసక్తిగానే అనిపిస్తయి.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. గురువారం హ‌న్మ‌కొండ‌లోని ఆయ‌న స్వ‌గృహంలో డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్ చేశారు. ఈసంద‌ర్భంగా అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలను వెల్ల‌డించారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే..!

‘కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు’

నేను 1956 జూలై 4న పర్వతగిరిలో పుట్టిన. మా అమ్మానాన్నలు ఆదిలక్ష్మి–జగన్నాథం. చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌. పదో తరగతిలో స్కూల్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన. నాకు పోటీగా నా మిత్రుడు బొల్లం సంపత్‌కుమార్‌ ఉండే. నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఉన్నా.. చేసిన ఓ తుంటరి పని వల్ల ఓడిపోయిన. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తది. నాకు 18 ఏళ్లకే పెండ్లి అయింది. కేసీఆర్‌ మామ కేశవరావు దగ్గరుండి సంబంధం చూసి పెండ్లి చేసిండు. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. మా నాన్న ఎర్రబెల్లి జగన్నాథం రాజకీయాల్లోనే ఉండేవాడు. పర్వతగిరి సర్పంచ్‌గా ఆరుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఐదు స‌మితిల్లో ఒక‌ట‌యిన‌ సంగెం సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుతో టాస్‌ వేయాల్సి వచ్చి ఓడిపోయాడు. తర్వాత ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌గా పోటీ చేసినా కాంగ్రెస్‌లోని లొల్లి వల్ల పదవి రాలేదు. వైస్‌ చైర్మన్‌గా, ఆ తర్వాత వరంగల్‌ ల్యాండ్‌బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేశాడు.

డాక్టర్‌ కావాలనేది నాన్న క‌ల‌.. నేను మాత్రం అటువైపు పోలే

మా నాన్న నన్ను డాక్టర్‌ చేయాలని అనుకున్నాడు. పట్టుబట్టి ఎల్‌బీ కాలేజీలో బైపీసీలో చేర్పించాడు. కాకతీయ మెడికల్‌ కాలేజీకి దగ్గరగా ఉంటుందని.. డాక్టర్లను చూసైనా నాకు ఆ ఆశ కలుగుతుందని భావించాడు. కానీ నాకు సదువు అంతగా అబ్బలేదు. దీంతో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివించాడు. చదువుకునే రోజుల్లో జయశంకర్‌ సార్‌ ఇంట్లో నెలరోజులు ఉన్న. తెలంగాణ ఉద్యమం చేసిన రోజుల్లో దుర్గా టాకీస్‌ తగలబెట్టిన కేసులో కూడా ఉన్న. అయితే మైనర్‌ను అని ఆ కేసు నుంచి తీసేశారు. వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి 15 ఎకరాల్లో మిర్చి వేసిన. తెగులు వచ్చి బాగా లాస్‌ అయిన. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌గా మారిన. ఆర్‌అండ్‌బీ పనులు ఎక్కువగా చేసిన. రంగశాయిపేట, తీగరాజుపల్లి రోడ్డు కూడా వేసింది నేనే.

ఎన్టీఆర్‌ ట్రైన్‌ దిగగానే.. నా రాజకీయ కథ మొదలైంది

మా నాన్న రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ చేసిన కక్షసాధింపులే నాలో రాజకీయ కసి పెంచినయి. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ పెడుతున్నాడని తెలిసి.. ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలుసుకొని వ‌రంగ‌ల్ నుంచి నాలుగు జీపుల్లో కార్యకర్తలను తీసుకొని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన. ఎన్టీఆర్‌ ట్రైన్‌ దిగగానే ‘జై ఎన్టీఆర్‌’ అంటూ నినాదాలు చేసినం. ఆయన నన్ను గుర్తించి నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప‌ల‌క‌రించారు.. ఏంటీ బాబు ఎక్క‌డి నుంచి వ‌చ్చారంటూ ఆరా తీశారు. వ‌రంగ‌ల్ నుంచి అని చెప్ప‌గానే.. కారులో త‌న‌తో పాటు నాందెడ్ల ఇంటికి తీసుకెళ్లారు. టిఫిన్‌ చేసిన అనంత‌రం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ఏర్పాటుపై సమావేశం ఉందని చెప్పి నన్నూ తీసుకెళ్లాడు. టీడీపీ ఏర్పాటు, జెండా రూపకల్పన కోసం ఎన్టీఆర్‌ పర్వతగిరి ఉపేందర్‌ను కన్వీనర్‌గా, యూత్‌ తరఫున నన్ను ఎంపిక చేశారు. నేను చురుగ్గా ఉండటంతో మొద‌ట్నుంచి నాపై ప్రత్యేక అభిమానం చూపేవాడు. వరంగల్‌లో ఎన్టీఆర్‌ సభ పెట్టాలనుకుని దోనపూడి రమేశ్‌బాబుతో కలిసి సన్నాహక సమావేశం పెట్టినం. 1982లో ఇస్లామియా గ్రౌండ్‌లో సభ భారీగా సక్సెస్‌ అయింది. ఆ సభకు నేను అధ్య‌క్ష‌త వ‌హించా. ఆ స‌భ‌లోనే నన్ను జిల్లా కన్వీనర్‌గా, రమేశ్‌బాబును పట్టణ అధ్యక్షుడిగా ఎన్టీఆర్‌ ప్రకటించాడు.

‘ఓడిపోయే సీటు’ అన్నారు.. బీ-ఫారం వెనక్కిచ్చా

1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ నన్ను పిలిచి టికెట్లు ఎంచుకోవాలని అడిగాడు. వ‌రంగ‌ల్ నుంచి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ టికెట్‌ ఇస్తే గెలుస్తామని చెప్పిన. నాకు వరంగల్‌ లేకపోతే వర్ధన్నపేట కావాలని పట్టుబట్టిన. నాలుగు బీ-ఫారాలు ఇచ్చాడు. వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకక బండారు నాగభూషణ్‌ను నిలబెట్టినం. ఆయన గెలిచిండు. పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని ఎన్టీఆర్‌ అడిగితే మాచర్ల సత్యనారాయణ బీసీ అని ఆయనకు ఇవ్వాలని సూచించిన. 1985లో టీడీపీ–బీజేపీ పొత్తులో వర్ధన్నపేట బీజేపీకి వెళ్లింది. నాకు హనుమకొండ బీ-ఫారం ఇచ్చారు. తీసుకొని మెట్లు దిగుతుంటే ఒక నాయకుడు ‘ఓడిపోయే సీటు నీకు ఇచ్చారు’ అన్నాడు. వెంటనే వెనక్కి వెళ్లి నాకు వద్దని చెప్పి వి.వెంక‌టేశ్వ‌ర్లుకు ఇప్పించిన ఆయ‌న గెలిచిండు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అభిమానంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అవకాశం ఇచ్చాడు. అయితే ఎడబోయిన బస్వారెడ్డి పోటీకి రావడంతో అదీ వదులుకున్న. 1987లో ప‌ర్వ‌త‌గిరి పీఏసీఎస్ చైర్మ‌న్‌గా ఎన్నికైన త‌ర్వాత‌ డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వికి పోటీ చేసి గెలిచా. వాస్త‌వానికి మా పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నా వ్యక్తిగత సంబంధాలతో గెలిచిన. తెలుగుదేశం పార్టీ కీల‌క నిర్ణ‌యాల్లో న‌న్ను ఎన్టీఆర్ భాగ‌స్వామిని చేసేవారు. పార్టీ పొలిట్‌బ్యూరో, త్రీమెన్‌ కమిటీలోనూ పనిచేసిన.తెలంగాణ‌తో పాటు రాయ‌ల‌సీమ‌, ఆంధ్ర‌ప్రాంతంలోని లీడ‌ర్ల‌తో కో ఆర్డినేష‌న్ చేసేవాడిని.

ఎంపీగా గెలవడం వండర్‌.. పాలకుర్తిలో మాస్క్‌తో తిరిగిన

1994లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన. 1999, 2004లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన. 2008లో వరంగల్‌ ఎంపీగా గెలవడం నాకు కూడా వండర్‌. జిల్లాలో నేనొక్కడినే టీడీపీ ఎమ్మెల్యేను. మిగతా వారంతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే. చంద్రబాబుకు నేను నిలబడనని చెప్పినా ఆయన వినలేదు. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి రమేశ్‌రెడ్డి పోటీ చేశారు. అందరూ ఆయన గెలుస్తారని అనుకున్నారు. కానీ నాకు ప్రతి ఊళ్లో పరిచయస్తులు ఉన్నరు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎవరూ ఊహించని విధంగా గెలిచిన. ఆ సమయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని పిలిచాడు. మంత్రి పదవి కూడా ఆఫర్‌ చేశారు. కానీ నేను పోలేదు. అది మ‌న‌సులో పెట్టుకున్న వైఎస్సార్‌.. డీలిమిటేష‌న్‌లో వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని ముక్క‌లుగా చేశారు. అంతేకాదు వర్ధన్నపేట, వరంగల్‌ ఎంపీ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. వరంగల్‌, పాలకుర్తిలో సర్వే చేసుకున్న. పాలకుర్తిలో ముఖానికి మాస్క్‌ వేసుకొని కూలీలు, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్న. ‘దయాకర్‌ వస్తున్నడు.. మంచోడు.. గెలిపించుకుంటాం’ అని చెప్పడంతో పాలకుర్తికి వెళ్లిన. 2009లో గెలిచిన. 2014లోనూ గెలిచి టీడీపీ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన. తర్వాత పది మంది ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన. కేసీఆర్‌ వెంటనే మంత్రి పదవి ఇస్తానన్నా.. పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాతే తీసుకుంటానని చెప్పిన. 2018లో ఆరోసారి గెలిచి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేసిన. ఎన్నో అవార్డులు వచ్చినయి.

‘వడ్డాణం చేయించు’ అన్నారు.. మంత్రి పదవే వద్దనుకున్న

1994లో తొలిసారిగా టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎన్టీఆర్‌ నన్ను పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నాడు. అయితే అదే స‌మ‌యంలో ఎన్టీఆర్‌–లక్ష్మీపార్వతి పెళ్లికి నేను నిరాకరించిన. నెలరోజులు ఆప‌గ‌లిగాను. తర్వాత ఒకరోజు ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లితే లక్ష్మీపార్వతి.. ‘నేను నీకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పాను కదా.. నాకు ఒక వడ్డాణం చేయించు’ అని అడిగారు. దీంతో ‘వడ్డాణం లేదు.. ఏమీ లేదు.. మంత్రి పదవి వద్దు’ అంటూ వచ్చేసిన. ఇది నేను చెప్పుకోవడం కాదు. ఈ ఘటనను చూసిన అప్పటి ఎన్టీఆర్‌ డ్రైవర్‌ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎన్టీఆర్‌ దగ్గరకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లలో నేను, జస్టిస్‌ రమణ ఇద్దరమే. ఉదయమే ఆయన దగ్గరకు వెళ్లి పార్టీ, ప్రభుత్వ విషయాలు చెప్పేవాళ్లం. టీడీపీలోకి సీతక్క, రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులను తీసుకొచ్చి ప్రోత్సహించిన. గంగుల కమలాకర్‌, విద్యాసాగర్‌రావు, మాగంటి గోపినాథ్‌ తదితరులకు టికెట్లు ఇప్పించడంలోనూ పాత్ర ఉంది. ఎంసీపీఐ–యూతో పొత్తు కోసం ఓంకార్‌తో మూడు నాలుగు సార్లు మాట్లాడిన. ఎంసీపీఐ–యూకు మూడు టికెట్లు ఇస్తామంటే ఓంకార్ నాలుగు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. చివ‌ర‌కు 1994లో నర్సంపేట నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని నిలబెట్టినం. ఆయన గెలిచిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్‌ సార్‌ సూచనతో చంద్రబాబు వద్దకు వెళ్లి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని అడిగిన. మొదట నిరాకరించడంతో పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తానని చెప్పిన. వెంటనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు.

ఎంజీఎం అంటే నాకు ప్రత్యేక ఇష్టం

ఎంజీఎం అంటే నాకు ప్రత్యేక ఇష్టం ఉండేది. 1994లో ఎమ్మెల్యేగా గెలిచాక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వాళ్లతో మాట్లాడి రూ.20 లక్షలు ఇప్పించి కొత్త బెడ్లు వేయించిన. కేఎంసీలో చదువుకున్న వాళ్ల పరిచయాలతో రూ.2 కోట్లు విరాళాలు సేక‌రించి ఆడిటోరియం కట్టించిన. ఎంజీఎం అభివృద్ధిని చూసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలోనే నన్ను పొగిడారు. కేసీఆర్‌కు సైతం ఆస్పత్రులు బాగుండాలని ఉండేది. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో మల్టీలెవల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి దుబాయ్‌లో చూసిన మోడల్‌ స్ఫూర్తిగా నిలిచింది. నన్ను ఎక్కడికి పోయినా ‘దయన్న’ అని పిలుస్తరు. పర్వతగిరిలో మాత్రం ‘దొర’ అంటరు. అందరితో కలిసిపోవడం, ఉదయం 6 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉండటం వల్లే ఆ అభిమానం వచ్చింది.

ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు

ఒకప్పుడు మా కుటుంబానికి 500 ఎకరాల వరకు ఉండేది. రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నానే తప్ప అక్రమంగా సంపాదించుకోలేదు. 200 ఎకరాల వరకు మా పేరు మీద ఉంటే.. ఇటీవల కబ్జాలో ఉన్నవారికి రాసి ఇచ్చిన. నాకు సాయం చేయడమే తెలుసు. నా భార్య ఉషా నాకు పుష్కలంగా సపోర్ట్‌ చేస్తది. ఎర్రబెల్లి ట్రస్ట్‌ను ఆమెనే చూసుకుంటది. కుట్టుమిషన్లు, నిరుద్యోగులకు కోచింగ్‌, 200 వాటర్‌ ప్లాంట్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నం. 2024 ఎన్నికల్లో ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా చెప్పిన. వేరే స్థానం కావాలని అడిగిన. కానీ అలా జరగలేదు. ‘ఎన్ని రోజులు దయాకర్‌రావే’ అనే మాట వచ్చింది. అందుకే ఓడిపోయిన. డీలిమిటేషన్‌లో స్థానాలు మారడం పక్కా. ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా. రాజకీయాల్లోకి మాత్రం వారసులను దింపే ఆలోచన లేదు.

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో/
కిర‌ణ్ గౌడ్ అరెల్లి
-7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.