ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది
ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన వద్దన్నా
ఎమ్మెల్యేగానే గెలవాలన్న పంతంతో ముందుకెళ్లా
2009లో చివరి నిమిషంలో బీఫాం చేజారింది.. 2012లో ఓడిపోయా!
2014లో టీడీపీ నుంచి గెలిచా.. కార్యకర్తల కోరికతో టీఆర్ఎస్లోకి
కేసీఆర్ భోళాశంకరుడు.. కేటీఆర్, హరీశ్‌రావులతోనూ మంచి అనుబంధం
పదేళ్లలో పరకాల నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో అభివృద్ధి
‘‘ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి’’
డిజిటల్ మీడియా ప్రతినిధులతో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్‌చాట్
‘‘ఒక అవమానం నా జీవితాన్నే మార్చేసింది. అప్పటివరకు నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యాపారం, కాంట్రాక్టు రంగాల్లో స్థిరపడుతున్నా. కానీ ఒక ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం నన్ను లోలోపల కుదిపేసింది. అదే రోజు నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినా వద్దన్నా. నాకు కావాల్సింది ప్రత్యక్ష రాజకీయాలు.. ఎమ్మెల్యేగా ప్రజల తీర్పు పొందడమే. 2009లో చివరి నిమిషంలో బీఫాం చేజారింది. 2012లో ఓడిపోయినా పట్టు వదల్లేదు. చివరకు 2014లో టీడీపీ నుంచి గెలిచా. ఆ తర్వాత కార్యకర్తల కోరిక మేరకు టీఆర్ఎస్లో చేరా. కేసీఆర్ సహకారంతో పదేళ్లలో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చా. ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి’’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన కుటుంబం, వ్యక్తిగత జీవితం, వ్యాపార ప్రస్థానం, రాజకీయాల్లోకి వచ్చిన మలుపు, ఎన్నికల్లో ఎదురైన ఎత్తుపల్లాలు, చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో తన అనుబంధాన్ని చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..!!

మాది వ్యవసాయ కుటుంబం.. వ్యాపారంపై ఆసక్తి
‘‘మాది శాయంపేట మండలం ప్రగతిసింగారం. తల్లిదండ్రులు సమ్మక్క, మల్లారెడ్డి. మేము ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడిని. మా నాన్నకు నేను వ్యవసాయంలోనే కొనసాగాలన్న కోరిక ఉండేది. 1986లో మేనమామ కూతురు జ్యోతిని వివాహం చేసుకున్నా. పెళ్లయ్యే నాటికి నాకు 19ఏళ్లు కూడా ఉండవనుకుంటా. ఆమె మరీ చిన్నది. నాకు వ్యవసాయంలో కన్నా వ్యాపారం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది. నాకు మొదటి నుంచీ కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఫినలెక్స్ కంపెనీలో మార్కెటింగ్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. పనితీరు..పర్ఫామెన్స్ చూసి మేనేజర్ పోస్టు ఇచ్చారు. కొద్దిగా ఆధునిక వ్యవసాయం వైపు రైతులు మళ్లుతున్న దశ అది. వ్యవసాయ బావులు, పైపులైన్ల పనులు ఆసమయంలో ఊపందుకున్నాయి. 1993లో నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్స్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకున్నా. అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయ్యాక 1994లో స్వజలధార వంటి పథకాలను అమలు చేశారు. దీంతో పైపులు, మోటార్లకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రొగ్రాం కింద నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80 శాతం ఆర్డర్లు నేనే తీసుకునేవాడిని. అలా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1997లో నా అమ్మకాల సామర్థ్యాన్ని గుర్తించి నంది పైప్స్ సంస్థ మారుతి కారును బహుమతిగా కూడా ఇచ్చింది’’ అని తెలిపారు.

వ్యాపారం నుంచి కాంట్రాక్టు రంగంలోకి
‘‘1999లో ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లే మెటీరియల్ కొనుగోలు చేయాలనే విధానం వచ్చింది. నేను సరఫరా చేసిన మెటీరియల్‌కు బిల్లులు ఆలస్యమయ్యేవి. కొందరు డబ్బులు కూడా ఎగ్గొట్టారు. ఇతరులకు సరఫరా చేస్తే బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. అందుకే నేనే కాంట్రాక్టర్‌గా మారాలని నిర్ణయించుకున్నా. 1999లో కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి 2002 నాటికి స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్‌గా ఎదిగా. 2003 నుంచి చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా పెద్ద పనులు చేపట్టా. అదే సమయంలో నా కుమార్తెను స్కూల్లో చేర్పించేందుకు వెళ్లినప్పుడు అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి విద్యారంగంలోకి వచ్చా. 2003లో గ్రీన్వుడ్ స్కూల్ ప్రారంభించాం. ఇప్పటివరకు 23 బ్యాచ్‌లు ఆ స్కూల్ నుంచి పదో తరగతి పూర్తి చేశాయి.’’

ఆ అవమానమే రాజకీయాలకు మలుపు
‘‘2008లో శాయంపేట–ప్రగతిసింగారం మధ్య చలివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టా. ఆ పనుల బిల్లుల విషయంలో అప్పట్లో ఓ పొలిటికల్ ఫ్యామిలీ నన్ను ఇబ్బంది పెట్టింది. ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం నాకు చాలా బాధ కలిగించింది. అప్పటివరకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేని నేను.. నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అదే నా రాజకీయ జీవితానికి ఆరంభం. ఆ అవమానం నాలో కసిని పెంచింది. ఎమ్మెల్యేగా గెలవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నా. అప్పటి నుంచి నా దృష్టి అంతా ప్రత్యక్ష రాజకీయాలపైనే పెట్టా.’’

దయాకర్‌రావు ప్రోత్సాహం.. చంద్రబాబుతో పరిచయం
‘‘ఎర్రబెల్లి దయాకర్‌రావుతో అప్పటికే నాకు పరిచయం ఉంది. రాజకీయాల్లోకి రావాలన్న నా నిర్ణయానికి ఆయన ప్రోత్సాహం ఇచ్చారు. వేం నరేందర్‌రెడ్డితో కలిసి నా ఆలోచనను చంద్రబాబునాయుడికి వివరించా. వరంగల్‌లో ఆయన పాదయాత్ర సమయంలో నాకు మరింత దగ్గరి పరిచయం ఏర్పడింది. 2009లో పరకాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నా ఆలోచనను చంద్రబాబుకు చెప్పా. కొందరు నన్ను చులకనగా మాట్లాడినా నా నిర్ణయం మార్చుకోలేదు. ఆ సమయంలో దయాకర్‌రావు నాకు ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేను.’’ ‘‘2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. చంద్రబాబునాయుడు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పారు. కానీ నేను అంగీకరించలేదు. నాకు ఎమ్మెల్సీ పదవి కంటే ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లి గెలవాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశాను. అదే సమయంలో టీడీపీ–టీఆర్ఎస్ పొత్తులో పరకాల సీటు టీఆర్ఎస్కు వెళ్లింది. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయమని కూడా కోరారు.
బీఫాం చివరి నిముషంలో చేజారింది..!
‘‘2009 ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా జరిగిన పరిణామాలు ఇప్పటికీ గుర్తున్నాయి. నామినేషన్ చివరి రోజున కొద్ది గంటల్లో గడువు ముగుస్తుందని సమయంలో నాకు బీఫాం ఇస్తున్నట్లుగా టీడీపీ ఆఫీసు నుంచి కాల్ చేశారు. నా డ్రైవర్‌ను హైదరాబాద్‌కు పంపా.అప్పుడు టీడీపీలోనే ఉన్న కొంతమంది కుట్రలు, రాజకీయ గందరగోళం మధ్య ఫాతిమా బ్రిడ్జి వద్దనే బీఫాంలతో వెళ్తున్న కారును అడ్డుకున్నారు. బీఫాంలు తీసుకున్నారు. బీఫాం అందుతుందనే నమ్మకంతో నేను కేంద్రంలోపలికి వెళ్లా. నా డ్రైవర్ ఇతర నాయకులు కలిసి బీఫాం ఇతర పత్రాలతో నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చేసరికే కొద్ది నిముషాల తేడాలోనే గేట్లు మూసేశారు. డ్రైవర్ గోడ దూకి లోపలికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. చివరి నిమిషంలో బీఫాం నా చేతికి రాకుండానే చేజారిపోయింది. అంతా సినిమా క్లైమాక్స్‌లా జరిగింది. ఆ రోజు బాధపడ్డా.. కానీ నా రాజకీయ ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. 2012 ఉప ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేశా. 33 వేల ఓట్లు సాధించా. పార్టీలోని కొందరు నాకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఓటమి ఎదురైంది. విషయం చంద్రబాబునాయుడికి తెలిసిన తర్వాత ఆయన సంబంధిత సదరు నాయకులను మందలించారు. ఓటమి తర్వాత కూడా ప్రజలతో నా సంబంధాలు తగ్గలేదు. పరకాల, శాయంపేట ప్రాంతాల్లోని పాఠశాలలకు 263 కంప్యూటర్లు అందించా. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగించా. ఓటమి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే రాజకీయాల్లో నిలబడలేం. అందుకే మరింతగా ప్రజల్లోకి వెళ్లా.’’
గుంటూరు యువగర్జనకు ప్రత్యేక రైలు
‘‘బాలకృష్ణ యువగర్జన సభ గుంటూరులో జరిగినప్పుడు పరకాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తీసుకెళ్లాలని అనుకున్నా. వరంగల్ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించా. పరకాల నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలపై స్పష్టత లేదని అప్పటి జిల్లా అధ్యక్షుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి బోగీ కేటాయింపు చేసేందుకు నిరాకరించారు. నేను వెనక్కి తగ్గలేదు. యువగర్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎర్రం నాయుడి వద్దకు నేరుగా వెళ్లి నాకు ఒక బోగి కేటాయించేలా చూడాలని రెక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ప్రకాశ్ రెడ్డికి చెప్పి చూసినా వినలేదు. ఆయన కూడా నేనేం చేయలేనన్న హావాభావాలతో విషయం చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. అసలు ఒక రైలు బుక్ చేసుకుంటే ఎంత ఖర్చవుతుందన్న అని అడగడంతో ఒక్కసారిగా నా వైపు చూశారు. ఏడున్నర లక్షలు అన్నారు.. ఏం ఇస్తావా అంటూ నవ్వుతూ అన్నారు. ఆయన ఇస్తాను అన్నా రైలు బుక్ చేయండి అని చెప్పడంతో షాకయ్యారు. ఆయనతో మాట్లాడుతుండగానే నిముషాల వ్యవధిలోనే ఆయన టేబుల్‌పై క్యాష్ పెట్టడంతో నేరుగా చంద్రబాబును ఫోన్లో కాన్ఫరెన్స్‌కు తీసుకుని విషయం చెప్పడంతో రైలు బుక్ చేయాలని ఆదేశించారు. నాకు బాగా గుర్తు.. నా రైలు వరంగల్‌లో మొదలైతే.. రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీ తరుపున బయల్దేరిన రైలు కాజీపేటలో బయల్దేరింది. తీసుకెళ్లిన కార్యకర్తలను అన్ని సౌకర్యాలతో, భోజనం ఇతర వసతులతో జాగ్రత్తగా ఇంటికి చేర్చా. అప్పుడు కార్యకర్తలు ఇది ధర్మన్న అంటే గర్వంగా పార్టీ మీటింగ్‌ల్లోనూ చెప్పారు. ఆ ఘటన తర్వాత చంద్రబాబుకు నాపై చాలా నమ్మకం పెరిగింది.
కార్యకర్తల కోసం ఏదైనా చేయాలనుకుంటే పదవి ఉండాల్సిన అవసరం లేదని ఆ సంఘటన నాకు నేర్పింది.’’
‘ఇంటింటికీ మీ చల్లా’తో ఏడాది పర్యటన
‘‘2013 నవంబరు 22న ‘ఇంటింటికీ మీ చల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించా. దాదాపు ఏడాది పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరిగా. ఒక్కో గ్రామంలో మూడు రోజులపాటు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకున్నా. రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, విద్య.. ఇలా ప్రతి అంశంపై ప్రజలతో మాట్లాడా. ఒక గ్రామంలో ఆకలితో పస్తులు పడుతున్న డిగ్రీ విద్యార్థినిని చూసిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ పర్యటన వల్ల నియోజకవర్గానికి ఏం అవసరమో నాకు పూర్తిగా అర్థమైంది. 2014లో టీడీపీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్యకర్తల కోరిక మేరకు టీఆర్ఎస్లో చేరా. కేసీఆర్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కేసీఆర్ భోళాశంకరుడు. మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు. మంచి విజన్ ఉన్న వ్యక్తి. నాపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయనతో నాకు ఉన్న అనుబంధం వల్ల కేటీఆర్, హరీశ్‌రావులతోనూ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నేను వ్యక్తిగత విమర్శలకు వెళ్లను. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటా.
పదేళ్లలో రూ.2,500 కోట్ల అభివృద్ధి
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను కేసీఆర్ సహకారంతో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చా. ‘ఇంటింటికీ మీ చల్లా’లో గుర్తించిన సమస్యల్లో దాదాపు 90 శాతం పరిష్కరించా. పరకాల రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణ, కొనాయిమాకుల ప్రాజెక్టు, 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఆరు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, 46 గ్రామాల్లో మహిళా భవనాలు, 57 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు, పరకాల పట్టణంలో సెంట్రల్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పల్లె దవాఖానలు, విద్యుత్తు సబ్స్టేషన్లు వంటి పనులు చేశా. పరకాలకు టెక్స్టైల్ పార్క్ తీసుకురావడం నాకు ప్రత్యేకమైన సంతృప్తినిచ్చింది. ఉపాధి అవకాశాలు పెంచే ప్రాజెక్టుగా దాన్ని భావించా. నేను పుట్టిన ప్రగతిసింగారాన్ని కూడా మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని అనుకున్నా. గ్రామ పంచాయతీ భవనం, రామాలయం, కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్, స్కూల్, లైబ్రరీ, ఆస్పత్రి వంటి సదుపాయాలు ఏర్పాటు చేశా. నా ఊరికి నేను ఏదైనా చేయగలిగానన్న సంతృప్తి ఉంది. ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమను నా ఊరికి, నా నియోజకవర్గానికి తిరిగి ఇవ్వాలన్నదే నా ఆలోచన. సాధ్యమైనంత వరకు గ్రామాల్లో రోడ్లను వెడల్పుగా నిర్మాణం చేయడం జరిగింది. 30, 40 ఫీట్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. పరకాలలో ఇలాంటి రోడ్ల నిర్మాణం చేపట్టాకి మిగతా నియోజకవర్గాల్లో చేపట్టారు.
ఆరోపణలను రాజకీయంగానే చూస్తా
నాపై భూకబ్జా ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఏ రైతు భూమినీ అక్రమంగా తీసుకోలేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల జోలికి వెళ్లలేదు. కౌకొండ గుట్టల్లో భూములు ఆక్రమించుకున్నట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది. నేను అప్పుడు కొనుగోలు చేసిన భూములన్నీ కూడా పట్టా భూములే. అమ్మిన రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలున్న రైతుల నుంచే కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భూములను కూడా నేను విక్రయించడం జరిగింది. నాపై ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. వ్యక్తిగత కక్షలకు వెళ్లకుండా రాజకీయంగా వచ్చిన విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతా.
‘మళ్లీ బరిలో ఉంటా.. కార్యకర్తల కోసమే’
‘‘గత ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలకు కొంత విరామం ఇవ్వాలని అనుకున్నా. కానీ ఇప్పుడు కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయ వాతావరణం, నన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి చూసి మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించా. వాటిని సరిదిద్దుకుంటా. నియోజకవర్గ సరిహద్దులు మారినా నాకు ప్రజలతో ఉన్న సంబంధాలు మారవు. 109 గ్రామ పంచాయతీల్లో నాకు బలమైన పట్టు ఉంది. ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి. వాళ్లకు అండగా ఉండాలి. రాజకీయాల్లో నేను చూసింది గెలుపు మాత్రమే కాదు.. అవమానం, ఓటమి, పోరాటం, విజయం అన్నీ. అందుకే ఇప్పుడు వచ్చే ఎన్నికలను మరో సాధారణ ఎన్నికగా చూడటం లేదు. నన్ను నమ్ముకున్న వాళ్లకు ఇచ్చే సమాధానంగా చూస్తున్నా. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. అందుకే మళ్లీ బరిలోకి దిగుతా అని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
కాకతీయ, ఎడిటర్ /
కిరణ్ గౌడ్ అరెల్లి
-7396604266

