మానాలకు మహర్దశ
మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన
మానాల ప్రధాన రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ
సూరమ్మ చెరువు నుంచి ఎత్తిపోతలతో సాగు, తాగునీరు
మరిమడ్ల రహదారికి రూ.7.43 కోట్లు, హనుమాన్ తండాకు రూ.1.17 కోట్లు
మానాల ప్రజల చిరకాల నీటి సమస్యకు పరిష్కారం చూపుతాం
: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి
కాకతీయ, రుద్రంగి: మానాల ప్రజల చిరకాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కలిగోట సూరమ్మ చెరువు పనులు తుది దశకు చేరుకున్నాయని, జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహదారి పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తిచేస్తామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ యూనియన్ కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డితో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. మానాల గ్రామానికి కీలకమైన మూడు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.14.20 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో మరిమడ్ల రహదారి నిర్మాణానికి రూ.7.43 కోట్లు, మానాల ప్రధాన రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.5.60 కోట్లు, హనుమాన్ తండా గొర్రెగుండం రహదారి నిర్మాణానికి రూ.1.17 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయితే గ్రామానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

సూరమ్మ చెరువు నుంచి నీరు
కలిగోట సూరమ్మ చెరువు పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మానాల ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. రహదారి నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ మానాల గ్రామానికి ప్రత్యేకమైన ఉద్యమాల చరిత్ర ఉందన్నారు. ప్రజా పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు, రుణమాఫీతోపాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తనకు ఘన స్వాగతం పలికిన మానాల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మానాల పేరే ఇంటిపేరుగా
మాజీ నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ యూనియన్ కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మానాల గ్రామం పేరునే తన ఇంటిపేరుగా పెట్టుకుని ప్రజల ఆదరాభిమానాలతో ఎదిగానని భావోద్వేగానికి గురయ్యారు. గ్రామ ప్రజల ప్రేమ, ప్రోత్సాహమే తన ఎదుగుదలకు కారణమని పేర్కొంటూ కంటతడి పెట్టారు. గిరిజనులకు పోడు పట్టాల పునరుద్ధరణతోపాటు సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సుదర్శన్‌రెడ్డిని కోరారు. రానున్న రోజుల్లో బాల్కొండ వర్గానికి ప్రాతినిధ్యం వహించాలన్న తన మనసులో మాటను ప్రజల ముందుంచారు. సూరమ్మ చెరువు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మానాలకు నీటిని అందించాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు మానాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర శంకర్‌గౌడ్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ హైమద్, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి, చందుర్తి సీఐ రవీందర్, ఎస్సై మోతీరామ్ నాయక్, రిటైర్డ్ ఏడీఈ భూక్య లక్ష్మణ్, తూమ్ జలపతి, కొమ్ముల రవీందర్, విడీసీ చైర్మన్ జక్కుల శ్రీనివాస్, జక్కు మోహన్, లక్కాకుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

