విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి
బయ్యక్కపేట పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ
కాకతీయ, ఏటూరునాగారం: తాడ్వాయి మండలం బయ్యక్కపేటలోని గిరిజన సంక్షేమ ప్రాథమికోన్నత పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన పీఓ వారి పుస్తకాలను పరిశీలిస్తూ చదువులో ప్రగతి, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం కంప్యూటర్ గది, వసతిగృహం తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతోపాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు బోధన, అభ్యసన ప్రగతి, హాజరు, పాఠశాల నిర్వహణపై నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

