ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడాలి
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
రోగులకు వసతులు అందుబాటులోకి తేవాలి
పరకాల ఏరియా ఆస్పత్రి సందర్శనలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాకతీయ, పరకాల : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్ మేల్, ఫిమేల్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ల్యాబ్, గర్భిణుల యాంటీ నాటల్ వార్డు, లేబర్ రూమ్, పోస్ట్ నాటల్ వార్డుతో పాటు మొదటి అంతస్తులోని గదులను పరిశీలించారు. ఫిజియోథెరపీ, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాలకు గదులు కేటాయించాలని, ఆయా విభాగాలను సులభంగా గుర్తించేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి అవసరమైన వసతులు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆసుపత్రి పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని భవిష్యత్ అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆసుపత్రి ముందు ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచడంతోపాటు బాక్స్ డ్రైన్ నిర్మించాలని ఆదేశించారు. తనిఖీలో సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, ఆర్ఎంవోలు డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ నందూ పటేల్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్అండ్బీ డీఈ లోరిన్ తదితరులు పాల్గొన్నారు.

