నైరుతి రుతుపవనాల తిరోగమనం
జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్న ఉపసంహరణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే దిశగా కదులుతున్నాయి. అక్టోబర్ 8న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి మీదుగా కొనసాగుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తిరోగమన రేఖ సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బీజాపూర్, హైదరాబాద్, బెళగావి, పనాజీ మీదుగా కొనసాగుతోందని తెలిపింది. ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు విస్తరించి, అక్టోబర్ 8న తెల్లవారుజామున బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తర ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

