జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి
పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని చాటేలా వేడుకలు నిర్వహించాలి
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని పిలుపు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
కాకతీయ, దేవరుప్పుల : జనగామ జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న వారు దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామ జిల్లా ఏర్పాటుతో జిల్లా కార్యాలయం, మెడికల్ కళాశాల, మాతా శిశు ఆసుపత్రి, వల్మిడి, బమ్మెర పోతన, పాలకుర్తి సోమేశ్వరస్వామి ఆలయం, జిడికల్ దేవాలయం వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాయని వారు పేర్కొన్నారు. దేవాదుల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వారు వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగే వేడుకలకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

